శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీమాత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు, రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు పాల్గొన్నారు.
సోమవారం జరిగిన స్వామివారి కల్యాణమహోత్సవంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, భక్తజనాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేదపండితుల ఆశీర్వచనాల నడుమ స్వామివారి ఆశీస్సులు పొందారు.
అలయానికి వచ్చిన మంత్రి లోకేష్ గారిని ఆలయ అధికారులు, వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనగాని సత్యప్రసాద్ గారు మరియు కందికుంట వెంకట ప్రసాద్ గారు కూడా ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేవాలయ మహిమాన్వితతను కొనియాడారు.
ప్రత్యేక ఆకర్షణగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తులు అధిక సంఖ్యలో దర్శించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. పుట్టపర్తి విమానాశ్రయం నుంచి కదిరికి రోడ్డు మార్గంలో చేరుకున్న మంత్రులకు, ప్రజాప్రతినిధులకు పార్టీ శ్రేణులు, భక్తులు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి గారు, టీడీపీ సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి గారు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, రథోత్సవం, చక్రస్నానం వంటి వైభవోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనున్నాయి.